గడ్డిమందును నిషేదించాలి

కరీంనగర్‌: అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.కిషన్‌ మాట్లాడుతూ.. పారాక్వాట్‌కు కచ్చితమైన విరుగుడు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరిమాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. బీఎన్‌.రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్‌ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించాలన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అరుణ్‌ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. బీఎన్‌ రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్‌ బాబు, ట్రెజరర్‌ నీలిమా, అలీం, కాంగ్రెస్‌ డాక్టర్‌ వింగ్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్‌, కిరణ్, రాంచందర్‌ పాల్గొన్నారు.