కరీంనగర్: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మానవీయ కోణంలో హాస్పిటల్ యజమాన్యాలు ఆరోగ్యసేవలను పునరుద్ధరించాలన్నారు. గడిచిన 21 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.1779 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లకు చెల్లించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం రాగానే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిందన్నారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి, పేదలకు మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కొత్త ప్యాకేజీల చేర్పుతో ప్రభుత్వం అదనంగా రూ.487.29 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు విడుదల చేశారని, ఆ డబ్బులు హాస్పిటల్స్ ఖాతాలో జమ అయ్యాయన్నారు. పెండింగ్ డబ్బులు విడతల వారిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి
