ధర్మపురి: వచ్చే గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్, వివిద శాఖల అధికారులతో సమీక్షించారు. 2027లో నిర్వహించే పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సరిపడా వసతులు కల్పించాలని, శాశ్వత ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇందుకోసం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆలయ పునఃనిర్మాణంపై సమగ్రంగా చర్చించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆగమశాస్త్రం ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం స్వామివారి బ్రహ్మపుష్కరిణి, ఆలయ పరిసరాలు, కోటిలింగాల పుష్కరఘాట్లను పరిశీలించారు. వారివెంట అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ ఈవో శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్ ఉన్నారు. ముందుగా శైలజరామయ్యర్, మంత్రి అడ్లూరి, కలెక్టర్ సత్యప్రసాద్ వేర్వేరుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్
