జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్‌పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివాదమేర్పడింది. పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. శనివారం పోలీసులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఏటా కుల సంఘం పెద్దమనిషి కూకట్ల మల్లయ్య జెండా ఎగురవేయడం అనవాయితీ వస్తోందని, పెద్దమనిషి మృతిచెందడంతో అతని కుమారుడు తిరుపతికి అవకాశం ఇవ్వాలని యాదవ సంఘం ప్రతినిధులు చెప్పగా సహకార సంఘం అధ్యక్షుడిగా తనకే జెండా ఎగురవేసే అధికారముందని బండి మల్లయ్య తెలిపారు. ఇరువర్గాల వాగ్వాదంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చర్చల అనంతరం ఇరువర్గాల ఆమోదంతో మరో పెద్దమనిషి దాడి నర్సయ్య జాతీయజెండాను ఎగురవేయడంతో వివాదం సద్దుమణిగింది.