- ఆపరేషన్ సింధూర్ లో మీ పోరాటం అద్వితీయం
- బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే మాకు ముఖ్యం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- శ్రీనగర్ గార్డెన్ ను సందర్శించిన కేంద్ర మంత్రి
- దల్ లేక్ లో కాసేపు బోటులో విహరించిన బండి సంజయ్
కరీంనగర్: మంచు పర్వతాలు, క్లిష్ణమైన వాతావరణంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అందిస్తున్న సేవలు అద్వితీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ లో బీఎస్ఎఫ్ సిబ్బంది చేసిన పోరాటాలు దేశానికి గర్వకారణమన్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది భద్రత తమ కర్తవ్యమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా గురువారం (తేదీ 09-04-2026) ఉదయం శ్రీనగర్ లోని బీఎస్ఎఫ్ క్యాంపస్ (ఎస్ హెచ్ క్యూ)లో ఐజీ అశోక్ యాదవ్ తోపాటు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులు, ఆపరేషన్ సిందూర్ లో బీఎస్ఎఫ్ జవాన్ల పాత్రను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సముద్ర మట్టానికి 15,500 అడుగుల ఎత్తులో మంచుకప్పబడి ఉన్న ప్రాంతాల్లోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న విషయాన్ని, మంచు తుపానును తట్టుకుని డ్యూటీ చేస్తున్న జవాన్ల ధైర్య సాహసాలను వీడియో ప్రజేంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో, వర్షానికి, చలికి, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ల భాగస్వామ్యంతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని వివరించారు. కనీస సౌకర్యాలు, వసతి లేకపోయినప్పటికీ సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న జవాన్ల ధైర్యసాహసాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. జవాన్ల భద్రత కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని, ఈ విషయంలో సంపూర్ణ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ సందర్శించారు. ఏటా నెల రోజులపాటు తెరిచి ఉంచే తులిప్ గార్డెన్ ను దర్శించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తులిప్ గార్డెన్ మొత్తం కలియ తిరిగారు. గార్డెన్ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన తులిప్ గార్డెన్ చూసేందుకు ఒక నెలలోనే దాదాపు 8 నుంచి 10 లక్షల మంది వస్తారని అధికారులు వివరించారు. అనంతరం భారీ భద్రత మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీనగర్ లోని ప్రసిద్ధి గాంచిన ‘‘దల్ లేక్’’ వద్దకు వెళ్లారు. కాసేపు దల్ లేక్ లో బోటులో విహరించారు.


