కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని అన్నికోర్టుల్లో ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెళ్లు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు చిన్నచిన్న సమస్యలకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని, అలా పేరుకుపోయిన సమస్యలు గుర్తించి, ఇరువర్గాలతో మాట్లాడి వారిని తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న 10 జంటలను కలపడంతో పిల్లపాపలతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. మోటార్ వాహనాల కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఇన్సూరెన్సు సంస్థలు, న్యాయవాదులతో మాట్లాడామన్నారు. రూ.2 లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులకు మోక్షం కలిగించనున్నట్లు వివరించారు. రాజీ చేసుకోదగిన ప్రతి కేసు లోక్అదాలత్లో పరిష్కారం అయ్యేలా పోలీసులతో సమావేశం నిర్వహించామన్నారు. గతంలో జిల్లాలో 17,500 కేసులు పెండింగ్లో ఉంటే.. వాటిని 16,844కు తగ్గించామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.