- రిటైర్డ్ బెన్ ఫిట్స్ రాకుండా ఇబ్బంది పెడుతున్నరు
- మా డబ్బులు మాకివ్వడానికి మీకెందుకు మనసొప్పడం లేదు?
- మీ జాప్యంవల్ల ఇప్పటికే 61 మంది చనిపోయారు
- కరీంనగర్ లో రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఇళ్లలో వెలిసిన బ్యానర్లు
- బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపు
- మార్చిలోగా రిటైర్డు ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని సర్కార్ కు సంజయ్ అల్టిమేటం
- లేనిపక్షంలో కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరిక
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వారంతా తమ ఇండ్ల ముందు ‘‘కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల్లో 61 మంది చనిపోయారని వాపోయారు. తాము దాచుకున్న సొమ్మును ఎందుకు ఇవ్వడం లేదని, జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినందుకు వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని భగత్ నగర్ లో బీజేపీ అభ్యర్ధుల పక్షాన ప్రచారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లిన సంజయ్ వెళ్లగా ఆ ఇంటి గేటుకు ‘ఈ ఇల్లు 2024లో రిటైర్డ్ అయిన ఉద్యోగిది. రిటైర్డ్ అయ్యి 23 నెలలు గడిచినా మాకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఇవ్వలేదు. మానసిక వేదనతో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వారికి ఓటు అడిగే హక్కు లేదు. దయచేసి అర్ధం చేసుకోండి’’ అని కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బండి సంజయ్ ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వాపోయారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్రుద్ధులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని మండిపడ్డారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు దాచుకున్న సొమ్మును, రావాల్సిన బకాయిలను కూడా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగులెవరూ బాధ పడొద్దని, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దని కోరారు. వారి పక్షాన పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ‘‘మీ ముందు మేముండి పోరాడతాం. లాఠీదెబ్బలు తిని జైలుకు వెళ్లేందుకు సిద్ధం. రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచి తీరుతాం. మార్చిలోపు బకాయిలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పై యుద్దం ప్రకటిస్తాం. వీటితోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేదాకా కొట్లాడి తీరుతాం’’అని స్పష్టం చేశారు.

