మెజారిటీ స్థానాలు బీజేపీకే..

  • కాంగ్రెస్‌ ప్రలోభాలకు తెరదీసింది
  • దేశమంతా కరీంనగర్‌ వైపు చూస్తోంది
  • కౌంటింగ్‌ వద్ద అప్రమత్తంగా ఉండండి
  • చిన్న పొరపాటు చేసినా నష్టపోతాం
  • అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో కేంద్ర మంత్రి సంజయ్‌

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొషన్‌ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. యావత్‌ దేశమంతా కరీంనగర్‌ ఫలితాలవైపు చూస్తోందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. గురువారం కరీంనగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ స్థానాలు రాబోతుండటంతో అధికార కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైంది. ప్రలోభాలకు గురిచేసి బీజేపీ కార్పొరేటర్లను లాగాలని చూస్తోందన్నారు. పార్టీని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లేనని చెప్పిన బండి సంజయ్‌ అధికార పార్టీ ఆశలకు లోబడి ఎవరైనా కాంగ్రెస్‌లోకి వెళ్తే తీవ్రమైన పరిణామాలుంటాయన్నారు. కార్యకర్తల ఆవేశాన్ని తట్టుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. సునీల్‌రావు మాట్లాడుతూ.. ఫలితాల సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థుల తరఫున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. చర్చలు, గొడవల పేరుతో దృష్టి మళ్లించేందుకు ప్రత్యర్థులు ప్లాన్‌ చేసే అవకాశముందని, వాటికి తావివ్వకుండా బ్యాలెట్‌ పైనే దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్‌ కేంద్రంలో ఎవ్వరితోనూ గొడవ పడొద్దని, ఏదైనా అభ్యంతరం ఉంటే రాతపూర్వకంగా రాసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కరీంనగర్‌ నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్దామని తీర్మానించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను పాల్గొన్నారు.