హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

  • ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్‌ఎంసీని ముక్కలు చేశారు
  • రేవంత్‌రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది
  • తెలంగాణలో తొలిసారి కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా
  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్రలను ప్రజలు పట్టించుకోలేదు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌: ‘ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారు. అదే రేవంత్‌ రెడ్డి పాలిట మరణ శాసనం కాబోతోంది. హైదరాబాద్‌ తోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయబోతున్నం. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నాం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయడం గొప్ప విషయమన్నారు. ఈ అద్భుత అవకాశం అందించిన కరీంనగర్‌ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కరీంనగర్‌ ప్రజలు 30 సీట్లిచ్చారు… ఈ సంతోషం పట్టలేనిదన్నారు. కరీంనగర్‌లో ఎంఐఎం కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ.. బీఆర్‌ఎస్‌కు కన్ను కొట్టిందని, ప్రజలు గమనించి గతంలో 7 సీట్లున్న ఎంఐఎంను 3సీట్లకే పరిమితం చేశామన్నారు. కరీంనగర్‌ స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీపైనా కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు. పార్టీని నమ్ముకుని, చెప్పిన మాట విని నామినేషన్లను ఉపసంహరించుకుని పనిచేసిన బీజేపీ నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ కార్పొరేషన్ లో 35కు చేరిన బీజేపీ బలం
కరీంనగర్‌: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే 13వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన తెల్ల లక్ష్మీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోట చేసి గెలిచిన విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. వీరిద్దరూ కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి విచ్చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరు బీజేపీ రెబల్ కార్పొరేటర్లు, మరో ఇండిపెండెంట్ సైతం బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో బీజేపీ సంఖ్య 35కు చేరుకుంది. వాస్తవానికి కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్ల సంఖ్య 66. వీరితోపాటు స్థానిక ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్(బీఆర్ఎస్) కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), ఎంపీ బండి సంజయ్ (బీజేపీ) ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 69కి చేరనుంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 35 కావాలి. బీజేపీ ఇప్పటికే 35కు చేరుకుంది. అవసరమైతే మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య సైతం అవసరమైన పక్షంలో ఎక్స్ అఫీఫియో సభ్యులుగా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ అవసరం పడే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే మరో 5 గురు ఇండిపెండెంట్, ఏఐబీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. శనివారం వారంతా బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.