కరీంనగర్: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశించారు. బహుజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా చింతకుంటలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల సమస్యలు తెలుసుకున్న ఆయన మధ్యాహ్నం తయారు చేసిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అన్నం దొడ్డుగా ఉండడంపై ప్రిన్సిపాల్‌ను మంత్రి ఆరా తీయగా, 15 రోజుల నుంచి దొడ్డు బియ్యమే వస్తున్నాయని తెలిపారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సన్నబియ్యం సరఫరా చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే డీఎస్‌వోపై చర్యలు తీసుకోవడంతో పాటు రెండురోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయంలోని మెస్ పరిసరాలు, డార్మెటరీ రూంలు పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతికి సూచించారు. అలాగే విద్యాలయ స్థలం కబ్జా కాకుండా వెంటనే సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, ఇందులో ఎంత పెద్దవారున్నా వదలొద్దని ఆదేశించారు. బహుజన, గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో చదువు, ఆరోగ్యం, వసతిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. అల్యూమినియం పాత్రల వల్ల భోజనం పులుపుకెక్కి అక్కడక్కడా ఫుడ్ పాయిజన్ అవుతోందని, ఇకపై అలా జరగకుండా రాష్ట్రంలోని అన్ని గురుకుల వసతి గృహాలకు స్టీల్ పాత్రలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. బహుజన బిడ్డలు ఐఐటీ, జేఈఈ, నీట్‌లో రాణించడమే లక్ష్యంగా చక్కని విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు
