జగిత్యాల: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్న ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తోపాటు వారి బంధువు, ఆర్మూర్‌కు చెందిన సోహెబ్ కలిసి ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి వచ్చేందుకు బస్టాండ్ వద్ద ఉన్నారు. అదే సమయంలో జగిత్యాల వైపు ఖాళీగా వస్తున్న ఓ కారు డ్రైవర్ వీరిని ఎక్కించుకుని బయల్దేరాడు. 30 కిలోమీటర్ల దూరం రాగానే అక్కడి భారీ వరదల్లో ఓ వాగు ఉపొ‍్పంగి ప్రవహించడంతో కారు అందులో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన సోహెబ్, డ్రైవర్ నీటి ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరారు. కారులోనే ఉండిపోయిన సమీన తన సెల్‌ఫోన్‌తో తన కోడలుకు ఫోన్ చేసి ‘పిల్లలు జాగ్రత్త.. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం..’ అని సమాచారం ఇచ్చింది. కారులోకి వరదనీరు చేరడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా సమీన ఫోన్ పనిచేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్కడి బంధువులకు సమాచారం అందించారు. వారు వెళ్లేసరికే ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటనలో టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గల్లంతయిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు అఫ్రిన భర్త అలీం, హసీన భర్త పాషా సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. సోమవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదని సమాచారం.
మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు
