రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్‌లో రోజూకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఈఏడాది మే 4న ప్లాంట్ వార్షిక మరమ్మతుల దృష్ట్యా కర్మగారాన్ని షట్‌డౌన్ చేశారు. అనంతరం జూన్ 16న ఉత్పత్తి ప్రారంభించారు. హెచ్‌టీఆర్ మార్చడంతో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంలో 70 శాతం మేర యూరియా ఉత్పత్తి జరిగింది. యూరియా డిమాండ్ అధికంగా ఉండడంతో ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఉత్పత్తి పెంచేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. దీంతో కర్మాగారంలోని అమ్మోనియా పైప్‌లైన్ లీక్ కావడంతో జూలై 16న రెండోసారి ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. మరమ్మతు అనంతరం ఆగస్టు 4న ఉత్పత్తి ప్రారంభం కాగా, ఆగస్టు 14న సెకండ్ షిఫ్ట్‌లో అమ్మోనియా కన్వర్టర్ లీకేజీతో మూడోసారి షట్‌డౌన్ చేశారు. ఉత్పత్తి ప్రారంభించేందుకు 29 రోజులుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్లాంట్ హెచ్‌టీఆర్ మరమ్మతు పనులను ముంబయికి చెందిన ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. మరమ్మతు కోసం ప్లాంట్ సామగ్రిని ముంబయికి తరలించారు. కానీ ఇంకా యంత్ర సామగ్రి కర్మాగారానికి చేరుకోకపోవడంతో యూరియా ఉత్పత్తి ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈనెల 20లోగా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆ ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆరు రాష్ట్రాలపై చూపుతుంది.
కర్మాగారంలో సాంకేతిక సమస్యలతో ప్లాంట్ నిత్యం షట్‌డౌన్ చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. మరమ్మతు అనంతరం కర్మాగారంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. హెచ్‌టీఆర్, అమ్మోనియా పైప్‌లైన్ మరమ్మతులు విజయవంతం అయితే సుమారు రెండేళ్ల పాటు ప్లాంట్ నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్మాగారంలో మరమ్మతు పనులను ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

