రిజర్వేషన్‌ జనరల్‌.. సర్పంచ్‌ బరిలో ఎస్సీలు!

మంథని: సాధారణంగా ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు అనుకూలంగా అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు జనరల్‌ కేటగిరీ ఉంటుంది. కానీ అక్కడ రిజర్వేషన‍్లకు భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల అది. ఆ గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. అయితే సర్పంచ్‌ అభ్యర్థులుగా బీసీ, ఓసీల నుంచి ఒక్కనామినేషన్‌ కడా దాఖలు కాలేదు. అందరూ ఎస్సీలే నామినేషన్‌లు వేశారు. అలాగే ఎనిమిది వార్డుల్లో నాలుగు ఎస్సీ, నాలుగు జనరల్‌ కాగా వాటిలో సైతం ఎస్సీలే నామినేషన్‌లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం 1,161 మంది ఓటర్లు ఉండగా ఎస్సీలదే మెజారిటీ. అయినా.. ఓసీలు, బీసీలు కలిస్తే ఎస్సీలకన్నా ఎక్కువగా ఉంటారు. కానీ.. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడం, వెంటనే నామినేషన్‌ల స్వీకరణ జరగడంతో గడువు లేక నామినేషన్‌లు దాఖలు చేయలేకపోయామని పలువురు ఆశావహులు తెలిపారు. అంతేకాకుండా జనరల్‌ మహిళగా రిజర్వేషన్‌ రావడంతో ఓసీ, బీసీల్లో మహిళలు ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణం.