చైన్‌మన్ల ఆగాడాలకు అడ్డుకట్ట

కరీంనగర్‌: నగరంలో చైన్‌మన్ల ఆగడాలకు బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ చెక్‌ పెట్టారు. ఎనిమిది మంది చైన్‌మెన్లను గంపగుత్తగా బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో క్షేత్రస్థాయిలో సహాయకులుగా ఉండాల్సిన చైన్‌మెన్లు అక్రమ వసూళ్లకు, వివాదాలకు చిరునామాగా మారడంతో ఈ చర్యతీసుకున్నారు. వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌కు బదులు మొత్తం రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించారు. నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఎనిమిది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చైన్‌మెన్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు టీపీఎస్‌లు, ఐదుగురు టీపీబీవోలకు సహాయకులుగా వీరు పనిచేస్తుంటారు. అక్రమ నిర్మాణాలు, ఫిర్యాదులు, వివాదాలు వస్తే క్షేత్రస్థాయిలో కొలతలు, ఇతరత్రా అవసరాలకు సహకరించడం వీరి విధి. తమ విధులకు మించి అక్రమ వసూళ్లు, బెదిరింపులతో చైన్‌మెన్‌లంటేనే భవన నిర్మాణదారులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైనా ఫిర్యాదు వస్తే అక్కడికి వెళ్లి అవతలి వాళ్లతో మాట్లాడుకొని డబ్బులు తీసుకొని ఫిర్యాదుదారుడిదే తప్పు అని తేల్చిచెప్పి రావడం చైన్‌మెన్‌ల ప్రత్యేకత. ఇలాంటి చైన్‌మెన్లకు కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతుండడంతో, వారి ఆగడాలు నిరాటకంగా కొనసాగాయి. దీనిపై ‘సాక్షి’లోనూ పలు కథనాలు వచ్చాయి. చైన్‌మెన్‌ల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. చైన్‌మెన్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ గంపగుత్తగా మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేశారు. వారిస్థానంలో రెగ్యులర్‌ ఉద్యోగులైన విజయ్, శ్నేషేష్‌ రాజ్, అన్వేష్, రామచంద్రం, అరుణ్, మల్లేశం, ఆనంద్‌కుమార్, జీత్‌కుమార్‌ను నియమించారు. రెగ్యులర్‌ఉద్యోగులైతే జవాబుదారితనం ఉంటుందనే ఉద్దేశంతో భర్తీ చేశారు. చైన్‌మెన్‌లలో ఇద్దరిని రెవెన్యూ, ఒకరు టౌన్‌ప్లానింగ్, ఐదుగురిని శానిటేషన్‌కు కేటాయించారు.