- పంచాయతీ ఎన్నికలో హాఫ్ సెంచరీ దిశగా బీజేపీ
- ఇప్పటికే 42 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు
- ఇంకా పలు పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్
- మరో 10 మంది గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల చూపు బీజేపీవైపు
- గత పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంట్ మొత్తం పోటీ చేసినా 21 స్థానాలకే పరిమితం
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 800లకు పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే…. కేవలం 22 స్థానాల్లో మాత్రమే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. కానీ ఈసారి మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్ ఆధ్వర్యంలో తొలి దశ ఎన్నికల్లోనే కడపటి వార్తలు అందే సమయానికి 42కిపైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగరేయడం విశేషం. రాత్రి 10.30 గంటల సమయానికి ఇంకా పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 50 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నట్లు కౌంటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిదశ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 160 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. అందులో 50కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందే దిశగా దూసుకెళుతుండటం, మరో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలోకి వచ్చేందుకు మంతనాలు జరుపుతుండటం గమనార్హం.
కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివ్రుద్ధి చెందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గ్రామాల అభివ్రుద్ధికి నయాపైసా కూడా ఇయ్యకపోవడమే ఇందుకు కారణమని ఇండిపెండెంట్ అభ్యర్థులు చెబుతున్నారు. పైగా బండి సంజయ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతన్నందున ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్ తోపాటు కేంద్రంతో మాట్లాడిన అత్యధిక నిధులను గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి తీసుకొచ్చే అవకాశముందని వారు భావిస్తున్నారు. బండి సంజయ్ సైతం… గ్రామాల అభివ్రుద్ధిపై తాను ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ రూపాల్లో నిధులు తీసుకొస్తానని పలుమార్లు చెప్పడంతో బీజేపీలో చేరితేనే తమ గ్రామాలకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ గుర్తుల్లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేయలేదు. కానీ బీజేప పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉన్నారు. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని వారికి వివరిస్తూ అప్రమత్తం చేస్తూ వచ్చారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పోల్ మేనేజ్మెంట్ పై పలు సూచనలు చేశారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల పరిస్థితిపై ఆరా తీస్తూనే గెలుపు తీరానికి చేర్చడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి తొలి దశ ఎన్నికల్లో 30 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తామని బీజేపీ నేతలు అంచనా వేశారు. 2, 3 దశ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు దీటుగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ తొలిదశలోనే అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

