Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట

కరీంనగర్‌: బీజేపీ సర్పంచులున్న గ్రామాలను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సర్పంచులు ఈర్ష్య పడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచులతో కేంద్ర మంత్రి శనివారం కరీంనగర్‌ సిటీ శివారులోని రాజశ్రీ గార్డెన్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారికి శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి లేనప్పటికీ గెలిచిన భారతీయ జనతాపార్టీ సర్పంచులంతా హీరోలని పొగిడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుంటుపడటం కారణంగా కొత్త సర్పంచులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశముందన్నారు. తట్టెడు మట్టి ఎత్తిపోయడానికి కూడా పైసలు లేవని.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నయాపైసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అయినా.. బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులు ఎవరూ బాధపడొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఎంపీ లాడ్స్, సీఎస్సార్‌ ఫండ్స్‌తో పాటు కేంద్రం ప్రభుత్వ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు ఈనెల 18లోపు బీజేపీలోకి వస్తే ఆ గ్రామాలకు కూడా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరకముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్లాన్‌ రూపొందించాలన్నారు. రెండో, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధిక సర్పంచ్‌ స్థానాలు గెలిచేలా చూడాలన్నారు. సమావేశంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిని గోపి, నాయకులు చెన్నమనేని వికాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.