కబ్జాకోరుల అంతు చూస్తా..

  • కొత్తపల్లికి రూ.8.74 కోట్లు సిద్ధంగా ఉన్నాయి
  • 19 సీసీ రోడ్లతోపాటు డ్రైనేజీలను నిర్మిస్తా
  • మేయర్ పీఠం అప్పగిస్తే అభివృద్ధిలో కొత్తపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్‌: కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ అప్పగించిన వెంటనే కొత్తపల్లితోపాటు కరీంనగర్ లో పేదల భూములు కబ్జా చేస్తున్న కబ్జాకోర్ల అంతు చూస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. కేంద్రం నుండి కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని, అందులో నుండి రూ.8 కోట్ల 74 లక్షలతో కొత్తపల్లిలో 19 సీసీ రోడ్లతోపాటు డ్రైనేజీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. కొత్తపల్లిలో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు గుంటి రమ్య శేఖర్, వాసాల రమేశ్ లను గెలిపిస్తే… ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసిన కంచె శేఖర్ ఎన్నోసార్లు ప్రజల కోసం జైలుకు వెళ్లారని , ఆయన భార్య 17వ వార్డు అభ్యర్ధి గుంటి రమ్య 25 రోజుల బాలింత అని సంజయ్ చెప్పగానే ఒక్కసారిగా రమ్య కన్నీంటి పర్యంతమయ్యారు. ఆమెను చూసిన జనమంతా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. గుంటి రమ్యతోపాటు వాసాల రమేశ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని నినాదాలు చేయడం గమనార్హం.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తపల్లిలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. వేలాది మంది తరలివచ్చిన ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి అభ్యర్ధించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

గతంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీగా మార్చారు. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైంది. ఏమైనా లాభమైందా? లాభం సంగతేమో కానీ ఉపాధి హామీ పనులు కరువయ్యాయి. ఈజీఎస్ నిధులు బంద్ అయినయ్.

ఇప్పుడు ఇక్కడ రెండు డివిజన్లు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కొత్తపల్లి కి కూడా అభివృద్ధి పరంగా అంతే ప్రాధాన్యతని ఇస్తాం. ఇక్కడ కూడా ఇక్కడ ప్రజలు నిరుత్సాహానికి గురి అవ్వద్దు. ఇంకా సరికొత్త జోష్ తో బిజెపిని ఆశీర్వదించాలి.

అమృత్ 2.0 కింద అప్పుడున్న కొత్తపల్లి మున్సిపాలిటీ 26 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. మున్సిపాలిటీ కి వచ్చిన నిధులు ఈ ప్రాంతంలోని ఖర్చు పెడతాం. కొన్ని పనులకు ఎంపిక చేసి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు జరుగుతున్నాయి.

ఇక నేను కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ మున్సిపాలిటీకి సిసి రోడ్లు డ్రైనేజీ కోసం 50 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెప్పించాను. కొత్తపల్లి అంటే నాకు ఎక్కువ అభిమానం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి దాదాపు 19 రోడ్లు సిసి డ్రైనేజీలకు కోసం. రూపాయలు 8.74 కోట్లు నిధులు కేటాయించాను. వాటి పనులు ఎన్నికలు పూర్తవుగానే బిజెపి మేయర్ రాగానే ప్రారంభిస్తారు.