- ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకం
- మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటికీ ముస్లింలు లబ్దిదారులే
- మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీ నుండి అధిక నిధులు తీసుకొస్తా..
- చిన్నప్పుడు ఇక్కడే టైర్ ఆట ఆడేటోడిని
- నేను పుట్టిన వాడలో చాలా పనులు చేసిన.. ఇంకా రూపు రేఖలు చేస్తా
- కోడూరి రవి నాకు ఆప్తుడు…ఆయన కొడుకును ఆశీర్వదించండి
- డి.శంకర్ నన్ను ఎంతో ప్రోత్సహించారు
- 10వ డివిజన్ ను దత్తత తీసుకుంటా…గెలిపిస్తే రూపురేఖలు మారుస్తా
- బీజేపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించండి
- కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్: తాను ముస్లింలకు వ్యతిరేకం కానే కాదని, ముస్లింలను వెనుకబాటుకు గురిచేస్తున్న ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకినని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలోనూ ముస్లింలు లబ్దిదారులుగా ఉన్నారని చెప్పారు. కావాలని ఎంఐఎం, కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయ లబ్ది కోసం ముస్లింలను రెచ్చగొడుతూ వెనకబాటుకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని పాతబజార్, కాపువాడ ఏరియాల్లో 55, 37 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు గుగ్గిళ్లపు మంజుల రమేశ్, గూడూరి ఏపీపీ చంద్ర లను గెలిపించాలని అభ్యర్ధిస్తూ బండి సంజయ్ కుమార్ అభ్యర్ధించారు. ఈ సందర్భంగా అక్కడికి వేలాదిగా తరలివచ్చిన ప్రలను చూడగానే….బండి సంజయ్ తాను చిన్నప్పుడే పాతబజార్, కాపువాడలోనే పుట్టి పెరిగానంటూ తన చిన్ననాటి జ్ఝాపకాలను నెమరేసుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు ఈ గల్లీగల్లీలో తిరిగి టైర్ ఆట ఆడేటోడిని. అద్దెకు సైకిల్ తీసుకుని తొక్కేటోడిని. ఇక్కడున్న కోడూరి రవి అన్న నాకు ఆప్తుడు. గుగ్గిళ్ల రమేశ్ సంగతి మీకు తెలిసిందే’’అని వ్యాఖ్యానించారు.
అక్కడున్న ముస్లింలను ఉద్దేశించి ‘‘నేను, బీజేపీ ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం కాదు. కానీ ముస్లింలను భయపెట్టి వాళ్ళను కంట్రోల్లో పెట్టుకునే ఎంఐఎంను మాత్రం వ్యతిరేకిస్తా. ముస్లింలలో కూడా చాలా పేద వాళ్ళు ఉన్నారు. మోడీ సర్కార్ వాళ్లకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది. సంక్షేమానికి పాటుపడింది. మోదీ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలతో ముస్లింలు లబ్ది పొందుతున్నారు. పేదరికంలో ఉన్న ముస్లింలకు కచ్చితంగా నా వంతు సహకారం అందిస్తాను. ముస్లిం మహిళల బాధలు చూసి ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసినం.’’అని భరోసా ఇచ్చారు. ‘‘కోడూరి రవి నాకు అత్యంత సన్నిహితుడు. అతను ఇక్కడ అందరితో కులమతాలకతీతంగా కలిసి ముస్లింలతో కూడా మంచిగా ఉండేవాడు. అందుకనే నేను.. రవన్న కుమారుడు కేపీపీ చంద్ర టింకును అభ్యర్థిగా నిలబెట్టాను. అదేవిధంగా గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన గుగ్గిళ్లపు మంజుల రమేష్ గారిని కూడా మీరు ఆశీర్వదించాలి.’’అని విజ్ఝప్తి చేశారు. అంతకు ముందు నగరంలోని వినాయక్ నగర్ ఆ తర్వాత విద్యానగర్ ట్యాంక్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న 10, 11, 48, 21, 22 డివిజన్ల అభ్యర్థులు డి.శంకర్, పండుగ స్వప్న, కర్ర పద్మ, కొండపల్లి సతీష్, బండ రమణారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు.
10వ వార్డును నేనే దత్తత తీసుకుంటా…అభివృద్ధి చేసి చూపిస్తా
వినాయక్ నగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘‘మాజీ మేయర్ డి.శంకర్ అన్న నాకు ఆప్తుడు. 2000 సంవత్సరం నుండి నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. డి.శంకర్ లేకుంటే అర్బన్ బ్యాంకు ఉండేదే కాదు… అర్బన్ బ్యాంకులోని పైసలను దోచుకోవాలని చూస్తే అడ్డుకున్న వ్యక్తి డి.శంకర్, పేదలకు రుణాలిచ్చి ఆదుకున్న వ్యక్తి. డి.శంకర్ ను పోటీ చేయాలని నేనే రిక్వెస్ట్ చేసిన. ఇకపై 10వ డివిజన్ ను నేనే దత్తత తీసుకుంటా. శంకరన్న వంటి మంచి వ్యక్తిని కార్పొరేటర్ గా బంపర్ మెజారిటీతో గెలిపిస్తే ఈ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.’’అని చెప్పారు.
‘‘20- 30 ఏళ్ల నుంచి ఒక పెద్ద సమస్యగా ఉన్న కట్టరాంపూర్ మెయిన్ రోడ్డు ను స్మార్ట్ సిటీ లోనే నిర్మించాం. అసలు ఈ రోడ్డు బాగుపడుతదా అని ఇక్కడ ప్రజలు ఎన్నోసార్లు బాధపడ్డారు. అలాంటి రోడ్డును మోదీగారు ఇచ్చిన నిధులతో బాగుపరిచి మీకు మేలు చేశాం. న్యూ శ్రీనగర్ కాలనీకి కొత్త రోడ్డు వేశాం. ఫకీర్ వాడకు కొత్త రోడ్డు వేశాం. మహాలక్ష్మి టెంపుల్ కి కొత్త రోడ్డు వేశాం. గౌతమి నగర్ కు వాటర్ సప్లై ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాం.’’అని చెప్పారు. కట్టరాంపూర్- కోతి రాంపూర్ రోడ్డు మధ్యలోకి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసి కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వక పోవడం తో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ‘‘బీజేపీకి మేయర్ పీఠం అప్పగించిన వెంటనే డివిజన్లలోని మిగిలిన రోడ్లను .. డ్రైనేజీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానన్నారు.

విద్యా నగర్ ట్యాంకు వద్ద..
శ్రీహరి నగర్ మొదలుకొని విద్యానగర్ వరకు స్మార్ట్ సిటీ నిధులతో కొత్త రోడ్డు వేసిన. సెయింట్ జాన్ స్కూల్ నుంచి యూనివర్సిటీకి వెళ్లే రహదారి ఎంత బాగుందో మీరందరూ చూస్తూనే ఉన్నరు. కేంద్రంలోని మోదీ సర్కారు నిధులతోనే ఇవన్నీ చేసినం. అమృత్ 1లో వచ్చిన రూ. 132 కోట్లతో శాతవాహన యూనివర్సిటీలో అతి పెద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఏర్పాటు చేసిన. దానిద్వారానే ఈ డివిజన్ లో తాగు నీటిని అందిస్తున్న.
21 వ డివిజన్లో 40చోట్ల కేంద్ర నిధులతోనే అంతర్గత రోడ్లు సిసి రోడ్లు ఏర్పాటు చేసినం. ఇటు ..స్పెన్సర్ రోడ్డును బాగు చేసినం. నగర ప్రజలకు ఫుడ్ కోర్టును శాతవాహన యూనివర్సిటీ రోడ్ లో ఏర్పాటు చేయడానికి స్మార్ట్ సిటీ నిధులు ఖర్చు పెట్టాం. హరి హర నగర్ విద్యానగర్ శ్రీరామ్నగర్ లో కొన్ని రోడ్లు వేసాం మిగతావి త్వరలో వేస్తాం. కురుమ వాడలో శ్మశాన వాటికను అభివృద్ధి చేశాం. పోలింగ్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) నుంచి తాగు నీటి సప్లై కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానిని త్వరలో తొలగిస్తాం బిజెపి మేరవగానే మిగతా పనులను పూర్తి చేస్తాం. ఈ రెండు డివిజన్లో డ్రైనేజీలన్నింటిని పూర్తి చేయిస్తాం.

