కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు భారీ వర్షాలు కురిశాయి. గన్నేరువరం పెద్దచెరువు ఉధృతంగా అలుగు పారుతోంది. పోలీసులు గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్‌కు రాకపోకలు నిలిపివేశారు. కాగా.. గన్నేరువరానికి చెందిన టేకు భాగ్యతో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి కొమరమల్లుకు బుధవారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికొడుకు, కుటుంబసభ్యులు, బంధువులు జగిత్యాల నుంచి వాహనాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి మీదుగా వచ్చారు. గన్నేరువరం పెద్ద చెరువు మత్తడి వద్ద రాకపోకలు నిలిపివేయడంతో కొన్ని గంటలు అక్కడే నిరీక్షించారు. ముహూర్తానికి ఆలస్యం అవుతుండడంతో, పెళ్లి బట్టలు, చెప్పులు తడవకుండా.. కాళ్లకు పెట్టిన పారాణి పోవద్దని పెళ్లికుమారుడిని గ్రామస్తులు భుజాలపై ఎత్తుకుని అలుగు దాటించి మండపానికి చేర్చారు. బంధువులు అతికష్టంపై నీటిలోంచి దాటారు.


