ఎగువమానేరు పరవళ్లు

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు (2టీఎంసీ)లు కాగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో ప్రాజెక్టు నిండి మత్తడి పోస్తోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా వరదనీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతోంది. ఆలస్యంగానైనా.. ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. మా‘నీటి’ పరవళ్లను తిలకించడానికి పర్యాటకులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వైపు ఎవరిని వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.

వాగు ఉధృతికి తెగిన రోడ్డు..
అనుకున్నదే అయ్యింది.. మళ్లీ వానాకాలం వచ్చింది.. మన రోడ్డు కొట్టుకుపోవడం ఖాయం.. బ్రిడ్జి కట్టరు.. మన కష్టాలు తీర్చరు..అంటూ కొన్ని రోజులుగా గంభీరావుపేట మండలంలోని ఏ గ్రామంలో విన్న ఇవే మాటలు. అన్నట్లుగానే గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు మంగళవారం మత్తడి పోస్తోంది. వాగు ఉధృతి పెరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంలోని మానేరు వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు తెగిపోయింది. మండలకేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సగానికిపైగా గ్రామాల ప్రజలు లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాల మీదుగా కిలోమీటర్ల దూరం తిరిగి మండల కేంద్రానికి రావాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.