బీసీ గర్జన సభలో కాంగ్రెస్‌ మోసాలు ఎండగడతాం

కరీంనగర్‌: కరీంనగర్‌లో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే బీసీ గర్జన కదనభేరి సభలో కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతామని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభకు బీసీ సమాజం, మేధావులు, సంఘాలు పాల్గొని కదం తొక్కాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం శాసనమండలి బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. కరీంనగర్‌ చారిత్రాత్మక పాత్ర పోషించబోతోందని, రెండో శ్రేణి పౌరులుగా దయనీయ స్థితిలో మగ్గుతున్న బీసీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ జరగనుందన్నారు. 150 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ డ్రామాలాడే స్థితికి దిగజారిందని మండిపడ్డారు. తమిళనాడు తరహాలో కొట్లాడి 9వ షెడ్యూల్‌లో చేర్పించడమే మార్గమని చెబితే ఢిల్లీలో కాంగ్రెస్‌ నాటకాలాడిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిన ప్రధాని మోదీని తిట్టి..రాహుల్‌ను ప్రధానిగా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ధర్నా బీసీ జీవితాలకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేకుండా బీసీ బిడ్డలను మోసం చేస్తోందన్నారు. చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ అడగకుండా ఢిల్లీలో మోసపూరిత «ధర్నాలు చేశారని దుయ్యబట్టారు. కేవలం ప్రధాని నరేంద్రమోదీ, కేటీఆర్‌ను తిట్టడానికి, రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికే ధర్నా నిర్వహించారని ఎద్దేవా చేశారు. సీఎంకు ఎంత బలుపుంటే మహబూబ్‌నగర్‌ సభలో బట్టలు ఉతికేవారిని ఎమ్మెల్యే, చేపలు పట్టుకునే వారిని మంత్రిని చేశానని మాట్లాడతారని, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆలోచించాలన్నారు. ప్రతీ జిల్లాలో బీసీ సభలు నిర్వహించి కాంగ్రెస్‌ను బొంద పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ధర్నాకు రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ మేయర్, ఆర్టీసీ చైర్మన్‌, కార్పొరేషన్‌ పదవులు, మరో ఐదు మంత్రి పదవులు బిసీలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ బండ ప్రకాష్‌, కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, వొడితెల సతీశ్‌బాబు, విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, వసంత తదితరులు పాల్గొన్నారు.