‘ఎల్లంపల్లి’ గేట్లు మళ్లీ ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను సోమవారం మరోసారి ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోని నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఆదివారం రాత్రి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీస్థాయిలో వచ్చిచేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉధృతికి అనుగుణంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.70 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, హైదరాబాద్‌కు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంపుహౌస్‌కు 3,150 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 1,65,632 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.