పరువు నష్టం పేరుతో కేటీఆర్‌ బెదిరింపులు

కరీంనగర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పరువునష్టం దావా వేసి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని న్యాయపరంగా ఎదుర్కొంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తొమ్మిదిసార్లు జైలుకు వెళ్లివచ్చానని, తనపై ఇప్పటికే వందకుపైగా కేసులు ఉన్నాయని అన్నారు. కేటీఆర్‌ మాదిరిగా ఇజ్జత్‌ దావాలు వేయాలంటే తాము అనేక కేసులు వేయవచ్చని తెలిపారు. తాను రాజకీయంగానే ఎదుర్కొంటానని, బెదిరించేందుకు ఇజ్జత్‌ దావా వేయనని ఎద్దేవా చేశారు. తాను లవంగం తింటే తంబాకు అన్నారని, దమ్ముంటే కుటుంబ సభ్యులతో దేవుడి సన్నిధికి రావాలని సవాల్‌ విసిరితే.. కేటీఆర్‌ ఎందుకు రావడం లేదని బండి ప్రశ్నించారు. ‘అమెరికాలో ఎవరెవరికి టీ‍్వట్‌ చేశావో? నీ సంగతి వేమిటో త్వరలోనే అన్నిఆధారాలతో బయటపెడతా’ అని సంజయ్‌ అన్నారు. ‘డ్రగ్స్‌ తీసుకోలేదని ముందుకు వచ్చే ధైర్యం నీకు ఉందా?’ అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. తాను రాజకీయ నాయకుడనని, పరువునష్టం దావాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.