కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, సిబ్బందికి రూ.30 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పారిశుధ్య కార్మికులకు పీపీఈ, శానిటేషన్ కిట్లు అందించారు. పారిశుధ్య జవాన్ శ్యాంసుందర్ మృతిపై మౌనం పాటించి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ పారిశుధ్య విభాగం, ఎలక్ట్రిసిటీ, హరితహారం, నీటి సరఫరా విభాగాల్లో పని చేసే కార్మికులు ప్రమాదాల బారిన పడితే కుటుంబానికి రూ.30 లక్షలు అందేలా బీమా చేస్తున్నామన్నారు. మున్సిపల్‌శాఖ ద్వారా కార్మికులకు చెల్లించే ఈఎస్ఐని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరపాలక సంస్థలో పని చేస్తున్న ప్రతి కార్మికుడు పూర్తిస్థాయి వివరాలు ఉండేలా ఈకేవైసీ చేసుకోవాలన్నారు. పీపీఈ కిట్లను కార్మికులు పనిసమయాల్లో తప్పకుండా వినియోగించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారధి సొసైటీ ద్వారా గ్లౌస్లు, షూలు, ఆఫ్రాన్లు, మాస్కులతో పాటు సబ్బులు, ఆయిల్ లాంటి వస్తువులతో కూడిన పీపీఈ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, హెల్త్ ఆఫీసర్ సుమన్, వారధి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.
బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా
