వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే నిధుల వరదే

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

వేములవాడ: ఎములాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననీ, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవనీ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారనీ, అట్లాంటి కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తోందనీ, అలాగే బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలో ఆలోచించి బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వరదల్లా తీసుకొచ్చి అభివృద్ధి పరుస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి, తిప్పాపూర్, పట్టణంలోని అంజనీనగర్, మహాలక్ష్మివీధి, అమరవీరుల జంక్షన్‌లలో బుధవారం రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే, వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంతపాడుతున్నారని అన్నారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని.. డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వేములవాడలో ఆగమశాస్త్ర సంప్రదదాయాలను పాటించకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని.. రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్‌ కాంక్రిట్‌తో కడుతున్నారని, గుడి నిర్మాణం పేరుతో కాంగ్రెస్‌ నేతలు మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పాపాలు అన్నీ ఇన్నీ కావు, రాజన్నను మోసం చేశారు. కాళేశ్వరం కూలింది. మల్లన్న సాగర్‌ దెబ్బతిన్నది. ఆ పాపాలన్నీ పెరిగినయ్‌ కాబట్టే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలింది. 10 ఏళ్లు రాజ్యమేలిన బీఆర్‌ఎస్‌ ప్రజల రక్తం పీల్చుకుంది. సాక్షాత్తు ఎములాడ రాజన్నకే కేసీఆర్‌ శఠగోపం పెట్టిండన్నారు. కార్‌ రిపేరయిషెడ్‌లో ఉందనీ, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నాడన్నారు. మున్సిపాలిటికి బీజేపీ అభ్యర్థులను గెలిపించి పంపిస్తే తాను కేంద్రం నుంచి నిధులు తెచ్చి వేములవాడ అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ సిరిసిల్ల ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు హాజరయ్యారు.