- గాంధీభవన్‌లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం
- కేటీఆర్…నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా
- నీ అరాచకాలు, నువ్వు చేసిన నీచ పనులన్నీ బయటపెడతా
- సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్ల: పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన బుధవారం మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ‘‘స్పీకర్ సార్…మీరు నిజాయితీ పరులు. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నరు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్‌లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణం.’’అని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి? ఏ అభ్యర్ధిని గెలిపించాలని నిలదీయండి. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండి’’’అని పిలుపునిచ్చారు.
అయ్య పేరు చెప్పుకుని రాలేదు..
నేను కేసీఆర్ కొడుకు లెక్క అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్తగా కష్టపడి మీకోసం లాఠీదెబ్బలు తిన్న. జైలుకు పోయిన. మరి నువ్వేం(కేటీఆర్) చేసినవ్. మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపుతవా? బిడ్డా.. నీ సంగతి చూస్తా.. మళ్లీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బండారం అంతా బయటపెడతా.. ప్రజలు నీ కంటే నాకు ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. 2.26 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మొన్న వానలొచ్చి పేదలు మునిగిపోతే వాళ్లను కాపాడే సోయి కేటీఆర్ కు ఉందా? నేను హెలికాప్టర్ తీసుకొచ్చి ముంపు బాధితులను కాపాడిన. నేను కేంద్రం నుండి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే…. కేటీఆర్ మాత్రం ఆ నిధులను దారి మళ్లించి కమీషన్లు దొబ్బితిన్నవ్. బీఆర్‌ఎస్ కార్యకర్తలారా… మీ కష్టాలను బీఆర్‌ఎస్ పట్టించుకోదు. ఎన్నికల్లో మిమ్ములను ఆదుకునే పరిస్థితి లేదు. కష్టమొస్తే ఆదుకునేది బీజేపీయే. నేను అండగా ఉంటా. బీజేపీలోకి రండి.
ఖజానా ఖాళీగా ఉంది..
కాంగ్రెస్ ను అడుగుతున్నా… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? అసలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలున్నయా? నన్ను కోసినా నయాపైసా ప్రభుత్వం వద్ద లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి యాడ నుండి తీసుకొచ్చి అభివృద్ది చేస్తరు? నిధులు ఇచ్చేది కేంద్రం… తెచ్చేది నేనే. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే… పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా… మేయర్ పీఠాన్ని మాకు అప్పగించండి. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తరు. పైసలు మావి…ప్రగతి మాది… సోకులు వాళ్లవి…కమీషన్లు వాళ్లవి… మళ్లీ అట్లాంటోళ్లకు మళ్లీ ఓట్లేస్తారా? ఆలోచిస్తారా? కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నీచ రాజకీయాలకు బుద్ది చెప్పండి. వాళ్ల అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా తీర్పు ఇవ్వండి. బీజేపీ అభ్యర్థుల దగ్గర పైసల్లేకపోవచ్చు. కానీ మీ కోసం కొట్లాడే దమ్ముంది? పైసలు రప్పించే తెగువ ఉంది? మేం మీ ప్రగతి గురించి, మీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్లు అవినీతి, కమీషన్ల కోసం ఆలోచిస్తున్నారు. అందుకే ఆలోచించి ఓటేయండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని కోరుతున్నానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, 39 వార్డుల కౌన్సిలర అభ్యర్థులు పాల్గొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులతో అవినీతికి పాల్పడమని, నిజానికి అందుబాటులో ఉండి పని చేస్తామని, దైవసాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా అంటూ.. బండి సంజయ్‌కుమార్ ప్రమాణం చేయించారు.

