సంజయ్‌..ఇకనైనా బుద్ధిగా ఉండు!

  • కాంగ్రెస్‌ కుటుంబంలో చిచ్చు పెట్టకు
  • ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఒప్పుకోవడం సంతోషం
  • అభివృద్ది అంటే పక్కింటికి కన్నం పెట్టడం కాదని తెలుసుకో
  • మున్సిపాలిటీకి అప్రతిష్ట మూటకట్టి మళ్లీ ఓట్లెలా అడుగుతావు?
  • మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల: ఐదేళ్లపాటు బల్దియా పాలనను తన కనుసన్నల్లో నడిపి.. 16 మంది కమిషనర్ల బదిలీకి కారణమై.. 8మంది మున్సిపల్‌ అధికారులను జైలుపాలు చేసి.. జగిత్యాల మున్సిపాలిటీని అవినీతి, అప్రతిష్ట పాలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే ప్రజలను ఓట్లెలా అడుగుతారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్‌ పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయంపై విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్‌ పార్టీ మారాడని అనడానికి ఆధారాలు లేవంటూ స్పీకర్‌ అనర్హత పిటిషన్‌ను కొట్టి వేశారని, ఎమ్మెల్యే ఇకనైనా బుద్దిగా ఉండి కాంగ్రెస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే దృష్టిలో అభివృద్ధి అంటే ఆర్థిక లాభం, పక్కింటికి కన్నం వేయడమేనా..? అని ప్రశ్నించారు. దశాబ్దకాలం బీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలనను ఎదిరించి నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కాళ్లల్ల కట్టె పెట్టడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల పల్లెంలో అన్నం లాక్కుని వలసవాదులకు పెడతానంటే ఊరుకోబోమన్నారు. స్పీకర్‌ నిర్ణయంతోనైనా ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానన్న విషయం గుర్తుకు రావడం సంతోషమన్నారు. చట్టసభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని, ఇకనైనా కాంగ్రెస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టడం ఆపి సొంత సంసారాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చిందన్నారు. అభివృద్ది అంటే ఎమ్మెల్యే ఆర్థిక లాభం, బిల్లుల చెల్లింపు కోసం తాపత్రయపడటం కాదన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వ పాలసీలో భాగమని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రత్యేకించి జగిత్యాలకు చేసిందేంటో చెప్పాలన్నారు. పదేళ్లు జెండా మోసినోళ్లను పక్కకు పెట్టి రాజ్యమేలుతున్న సంజయ్‌ యావర్‌రోడ్డు, బైపాస్‌ రోడ్ల విస్తరణ ఎందుకు చేపట్టలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట నాయకులు కొత్త మోహన్, విజయలక్ష్మి, బండ శంకర్, దుర్గయ్య, పుప్పాల అశోక్, రాధాకిషన్, సురేందర్, రఘువీర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.