నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే..

జగిత్యాల: తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనేనని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మోతెలోగల ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే బీఆర్‌ఎస్‌ అనర్హత కేసు వేసిందని, అయినా తాను బీఆర్‌ఎస్‌ను ఎప్పుడూ విమర్శించలేదని పేర్కొన్నారు. సీఎంను కలిసిన మరుసటిరోజు తన ఇంటిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని, అయినా ఓపికగా ఉన్నానని, ఎవరు విమర్శించినా.. అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయబోనని తెలిపారు. ఇప్పటికీ తన జీతం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.5 వేలు రీఫండ్‌ కట్‌ అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ విప్‌ జారీ చేస్తే దానికనుగుణంగానే పనిచేస్తానని వెల్లడించారు. తనకు అనుకూలమైన వారు బీఆర్‌ఎస్‌ నుంచి నిలబడితే వారికోసం కూడా పనిచేస్తానన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉన్నారు.