బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌కు బీజేపీ షెల్టర్‌ ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో సుడా భవన సముదాయ నిర్మాణానికి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డ్యాం సేఫ్టీ అధికారులు నిర్ణయిస్తారన్నారు. నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం జరిగి ఆ ప్రాంతం ముంపునకు గురై ప్రాణ, ఆస్తి, పంటనష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రాజెక్ట్‌ వద్దకు ఇప్పుడు పోయి డ్రామాలు ఆడుతున్న నాయకులు, నిర్మాణ సమయంలో నాణ్యతతో కట్టాలని చెబితే బాగుండేదన్నారు. కాళేశ్వరంపై బీజేపీ నేతలు అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్‌కు షెల్టర్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిల్లుపై బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఢిల్లీలో తాము ధర్నా చేస్తే చాలా మంది సంఘీభావం పలికారని, బీజేపీ 8 మంది ఎంపీలు ఎందుకు పాల్గొనలేదన్నారు. రాష్ట్రపతి వద్ద ఆమోదం పొందేలా ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని అడుగులు తాము వేశామని, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎవరిని పిలవాలనేది విచారణ అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.