కరీంనగర్: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ‘మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’.. అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్‌లోని తన నివాసంలో శనివారం బండి సంజయ్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పులు, పాపాల నుంచి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ‘నేను ఏ గుడికైనా వచ్చిప్రమాణం చేస్తాను.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా’ అని సవాల్ విసిరారు. అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే కేసీఆర్, ఆయన కొడుకు ఎప్పటికీ జైల్లోనే ఉంటారని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు? విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు
