కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో 9వతరగతి చదువుతున్న 9మంది విద్యార్థి«నులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో 9వతరగతి చదువుతున్న రచన, లాస్య, ప్రణవి, సోని, లక్ష్మిప్రియ, వైష్ణవి, శ్రీయామిణి, అర్చన, అనూహ్య ఒకేగదిలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వీరిని ఎలుకలు కరిచాయి. స్పెషలాఫీసర్ మాధవి విషయాన్ని గోప్యంగా ఉంచి శుక్రవారం సాయంత్రం పీహెచ్‌సీలో వైద్యం చేయించారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి రావడంతో ఎంఈవో లక్ష్మీనారాయణ, ఎంపీవో ప్రభాకర్, సూపరింటెండెంట్ రాఘవేందర్‌రెడ్డి, వైద్యాధికారి శ్రావణ్‌కుమార్ కేజీబీవీలో వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు పీహెచ్‌సీ డాక్టర్లు శ్రావణి, శ్రావణ్‌కుమార్ వైద్యపరీక్షలు చేసి, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఎంపీవో ప్రభాకర్ తెలిపారు. డార్మెటరీ పక్కన స్టోర్‌రూం ఉండడంతో ఎలుకలు ఆవాసం ఏర్పర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు.
కేజీబీవీ విద్యార్థినులను గాయపర్చిన ఎలుకలు
