ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

జగిత్యాల: ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడొద్దన్నందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడిపల్లి రాజమురళి, సరిత దంపతులకు కుమారుడు విష్ణువర్దన్‌, కూతురు ఉన్నారు. విష్ణువర్దన్‌ జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం విష్ణువర్దన్‌పై ప్రహరీ కూలడంతో తలకు పలుచోట్ల బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి చదువులో వెనుకబడ్డాడు. కొద్దిరోజులుగా సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి సరిత మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషువర్దన్‌ మృతితో లింగంపేటలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నాడు. కుమారుడి మరణవార్త విని స్వదేశానికి బయల్దేరినట్లు బంధువులు తెలిపారు. విష్ణువర్దన్‌ తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.